అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం గా ఉండాలని సూచించింది. శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
ఈ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు అదే సాలు జారీ చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1070,112, 18004250101 ను అందుబాటులో ఉంచామని చెప్పారు.