కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. కర్ణాటకలోని 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ లో పడ్డారంటూ సంచలన ప్రకటన చేశారు. ఇందులో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఉన్నారని.. కేంద్ర స్థాయి లీడర్లు కూడా హనీట్రాప్ లో పడ్డారంటూ దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలపైనే కర్ణాటక బీజేపీ, జనతాదళ్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో హనీట్రాప్ పై సీబీఐ విచారణ జరిపించాలంటూ బీజేపీ, జనతాదళ్ పట్టుబట్టాయి.
బడ్జెట్ సమావేశాలపై సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న టైమ్ లో బీజేపీ, జనతాదళ్ సభ్యులు తీవ్ర ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి హనీట్రాప్ మీద విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశ ప్రతులను, అలాగే కాంట్రాక్టుల్లో ముస్లింలకు చేసిన 4 శాతం రిజర్వేషన్లను చింపేసి స్పీకర్ మీద విసిరేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బుక్ లను ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విసిరేశారు. స్పీకర్ మీద ఇలా చేసినందుకు విపక్ష ఎమ్మెల్యేలను 16 మందిని ఆరు నెలల పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇదే హనీ ట్రాప్ మీద హోంమంత్రి జి.పరమేశ్వర్ కూడా స్పందించారు. హనీట్రాప్ మీద తోటి మంత్రి ఆరోపణలు చేశారు కాబట్టి కచ్చితంగా దాన్ని సీరియస్ గా తీసుకుంటామని.. హనీట్రాప్ కు పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రకటించారు. అటు సిద్ధరామయ్య కూడా దీనిపై స్పందించారు. హనీట్రాప్ కు పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. కర్ణాటకలో హనీట్రాప్ ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. కానీ అవేమీ అంతగా నిలబడలేకపోయాయి. కానీ ఈ సారి నటి రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.
గోల్డ్ స్మగ్లింగ్ లో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మందే ఉన్నారని.. రన్యరావు వెనకాల రాజకీయ నేతలు ఉన్నారనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ ఆ కేసు మీద అటు అధికార పార్టీ నేతలు గానీ… ఇటు ప్రతిపక్ష నేతలు గానీ నేరుగా ఎలాంటి డిమాండ్లు చేయకపోవడం గమనార్హం. గోల్డ్ స్మగ్లింగ్ మీద నేరుగా మాట్లాడకపోయినా ఇప్పుడు హనీట్రాప్ వ్యవహారానికి గోల్డ్ స్మగ్లింగ్ కు లింకులు ఉన్నాయనే వార్తలు కర్ణాటక మీడియాలో వస్తున్నాయి. ఇది సిద్ధరామయ్య ప్రభుత్వానికి సవాల్ గా మారిపోయింది. మరి ఈ హనీట్రాప్ వ్యవహారంపై ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే అంటున్నారు.