ఎన్టీఆర్ నటన గురించి ఇప్పటికే ఎంతో మంది దర్శకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటన గురించే గతంలో రాజమౌళి ప్రత్యేకంగా కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ఇండియన్ సినిమాకు దొరికిన వరం అని కితాబిచ్చాడు జక్కన్న. ఇప్పటి వరకు ఇండియన్ డైరెక్టర్ల మనసులు గెలిచిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ప్రశంసలు అందుకున్నాడు. హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ గన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందంటూ తెలిపాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో అడవి జంతువులతో ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకే సీన్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆ సీన్ చూసి నేను ఎన్టీఆర్ కు ఫిదా అయిపోయాను అంటూ తెలిపాడు. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ ప్రాంచైజీ తో పాటు పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్ట్ చేసిన సూపర్ మ్యాన్ సినిమా ఈ ఏడాది జులైలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నటనకు ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఫిదా అవుతున్నాడంటూ ఆయన మాట్లాడిన వీడియోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ వార్-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.
ఈ సినిమాలు కూడా భారీ హిట్ అయితే మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్తుందంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమా ఏమైనా చేస్తాడో లేదో చూడాలి.