యువ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో చిత్రం తెరకెక్కింది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటించిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో చిత్ర అనుభవాలను పంచుకున్నారు.
రామ్ ఎనర్జీ సూపర్బ్..
‘ది వారియర్’ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేయడం పక్కా. హీరో రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టమని నెర్వస్ ఫీలయ్యా. రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలు చూశా. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు రామ్ ఎనర్జీ మ్యాచ్ చేయడానికి నెర్వస్ ఫీలయ్యాను. కానీ, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. క్లాస్ అయితే ‘విజిల్…’ సాంగ్.. కొంచెం స్టయిలిష్ అంటే ‘బుల్లెట్…’ సాంగ్.
ఆర్జే వీడియోస్ చూసి చూశా..
సినిమాలో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే. మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్… మధ్యలోని రైల్వే స్టేషన్ ఇలా సాగుతుంది. తెలుగు ఆర్జే వీడియోస్ చాలా చూశా. వాయిస్ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా.. ఎక్స్‌ప్రెషన్ ఫీల్ అవ్వాలి. ఫారిన్ ఆర్జే వీడియోస్ చూశా. పాడ్ కాస్ట్ వీడియోస్ చూసి ప్రిపేర్ అయ్యాను.
కథ విని ఎగ్జైట్ అయ్యా..
దర్శకుడు లింగుస్వామికి ఏం కావాలో స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు ఎలా నటించాలో చేసి చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు. లింగుస్వామి ‘ఆవారా’ను తమిళంలో చాలాసార్లు చూశా. ఆయన ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఆయన సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా.. పెర్ఫార్మన్స్‌కు అవకాశం ఉంటుంది. ది వారియర్ కథ విన్నప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. బయట సాఫ్ట్‌గా ఉండే ఆయన.. విలన్ రోల్‌లో అద్భుతంగా నటించారు.
తమిళం నేర్చుకుంటున్నా..
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో వరుసగా రెండు సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరికి సినిమా అంటే ప్రేమ. ది వారియర్ బైలింగ్వల్ సినిమా. తమిళ్ లో ఎంట్రీ కావడంపై సంతోషంగా ఉంది. తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘ఉప్పెన’కు కోలివుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అంత ప్రేమను ఊహించలేదు. ఇప్పుడు సూర్య గారితో మరో తమిళ సినిమా.. నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు-తమిళ్ బైలింగ్వల్. ఇప్పుడు తమిళం నేర్చుకుంటున్నా. ‘ది వారియర్’ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’తో ప్రేక్షకుల ముందుకు వస్తా.