కొన్ని కొన్ని సినిమాలు విచిత్రమైన కాంబినేషన్ లో తెరకెక్కుతాయి. సినిమా విషయంలో హీరోని అడిగితే .. కథ బాగా నచ్చింది. ఇందులోని కీ పాయింట్ చాలా ఇంపాక్ట్ కలిగించింది అందుకే ఈ కథకు ఓకే చెప్పాను అని చెబుతాడు. అయితే కొన్ని కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా హీరోలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. తాను వదులుకున్న కథను మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అయ్యో .. అని నాలుక కరుచుకోవడం కామనే ! తెలుగులో అలాంటి సినిమాలు మిస్ అయిన హీరోలు, కథ నచ్చకో .. కథ చెప్పినప్పుడు మరో మూడ్ లో ఉండో వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. నిజమే వద్దంటే అంతే మరి? అనుకునేలా చేస్తూంటాయి. మరి అలాంటి సినిమాలు ఏమిటి ? ఏ హీరో ఏ కథను వదులుకున్నాడో ఓ లుక్ వేద్దామా ..
శ్రీమంతుడు ..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని మహేష్ ని సూపర్ స్టార్ గా మరో మెట్టు ఎక్కించింది. నిజానికి ఈ కథను ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడట ? ఏంటి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే. కొరటాల శివ ముందు ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పాడట .. కానీ ఎందుకో ఈ కథ ఎన్టీఆర్ ని అంతగా ఇంపాక్ట్ చేయకపోవడంతో మరో కథ చెప్పండి అని అడిగాడట ఎన్టీఆర్. శ్రీమంతుడు కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ కథ చెప్పాడు కొరటాల. మరి శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఎన్టీఆర్ వదులుకున్నాడన్నమాట. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు .. ఈ కథను ఆ తరువాత రామ్ చరణ్ కూడా వదులుకున్నాడట. ఎన్టీఆర్ శ్రీమంతుడు కథకు నో చెప్పడంతో అదే కథను రామ్ చరణ్ కు చెప్పాడట కొరటాల. ఊరిని దత్తత తీసుకోవడం లాంటి పాయింట్ నా ఇమేజ్ కుదురుతుందా అనే డౌట్ తో చరణ్ నో చెప్పాడట. మొత్తానికి శ్రీమంతుడు లాంటి సంచలన విజయాన్ని అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ వదులుకున్నారన్నమాట.
పవన్ కళ్యాణ్ ఇడియట్ ని మిస్సయ్యాడు ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాధ్ ఆ తరువాత రవితేజతో తెరకెక్కించిన ఇడియట్ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. చిన్న హీరోగా ఉన్న రవితేజని స్టార్ గా నిలబెట్టింది ఇడియట్ సినిమా. నిజానికి ఈ కథను ముందు పవన్ కళ్యాణ్ కె చెప్పాడట పూరి జగన్నాధ్. అయితే ఎందుకో ఈ కథ పవన్ కళ్యాణ్ కు నచ్చలేదని చెప్పేశాడట .. దాంతో ఆ కథను రవితేజ కు చెప్పడం .. ఇడియట్ గా రవితేజ సంచలన విజయాన్ని అందుకోవడం మనకు తెలిసిన విషయాలే. ఇక మహేష్ కెరీర్ లో సంచలన విజయాన్ని అందుకున్న అతడు సినిమా కథ కూడా ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్ళింది. త్రివిక్రమ్ దర్శకుడిగా టెక్నీకల్ స్టాండర్డ్ తెలిపిన సినిమా అది. పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఆ కథను మహేష్ కి చెప్పి అతడుగా సంచలన విజయాన్ని అందించాడు త్రివిక్రమ్. ఇదే లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ ఆర్య అయ్యుంటే ..
అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ హీరోగా ఎలా నిలబడతాడో అన్న సంశయం ఏర్పడింది అందరిలో. దాన్ని పటాపంచలు చేస్తూ సుకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ .. ఆర్య చిత్రాన్ని తెరకెక్కించాడు. ముందు ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పడంతో మాస్ ఇమేజ్ ఉన్న నేను లవ్ స్టోరీ చేస్తే జనాలు చూస్తారా అనే అనుమానాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేస్తాడట, దాంతో ఆ కథను అల్లు అర్జున్ కు చెప్పి ఒప్పించాడు సుకుమార్. ఇక ఆర్య గా అల్లు అర్జున్ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. మొత్తానికి ఎన్టీఆర్ అలా ఆర్య ను మిస్సయ్యాడు.
దిల్ మిస్సయిన హీరో ?
మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వినాయక్ ఆది సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత దిల్ కథను ముందు ఎన్టీఆర్ కు చెప్పాడట వినాయక్. అప్పటికే ఆది సినిమా చేశాను కాబట్టి మళ్ళీ ఇలాంటి కథ చేయలేను అని చెప్పడంతో ఆ కథను హీరో నితిన్ కి చెప్పడంతో నితిన్ ఓకే అనడం .. దిల్ సినిమా సంచలన విజయం అందుకోవడంతో నితిన్ కి మంచి మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చింది దిల్. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మెన్ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికి పలు సినిమాల్లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ కథను మొదటి తమిళ హీరో సూర్య కు వినిపించాడట పూరి. ఎందుకో ఈ కథ సూర్యకు నచ్చకపోవడంతో అది మహేష్ కి చేరింది. ఇక నాగ చైతన్య, సమంత జంటగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమా సంచలన విజయాన్ని అందుకుని నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ కథను గౌతమ్ మీనన్ ముందు మహేష్ బాబుకు చెప్పాడట. మరి ఇంత క్యూట్ లవ్ స్టోరీ ని తాను చేయలేనని మహేష్ చెప్పడంతో ఆ కథ నాగ చైతన్య దగ్గరికి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా సినిమాలే ఉన్నాయి.