హీరో విశాల్ హెల్త్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయనకు ఏదో అయిపోయిందని ప్రచారం చేశారు. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న సినిమా మదగజరాజ. ఈ సినిమా ఈవెంట్ ను గత వారం నిర్వహించారు. ఆ ఈవెంట్ లో విశాల్ వణుకుతూ కనిపించారు. కనీసం మైక్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోయారు. మాటలు కూడా సరిగ్గా రాలేదు. కాస్త సన్నబడ్డట్టు కనిపించారు. దాంతో విశాల్ కు అంతుచిక్కని వ్యాధి సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తాజాగా విశాల్ తన హెల్త్ గురించి స్పందించారు. మదగజరాజ ప్రీమియర్ కు హాజరైన ఆయన మీడియా ముందుకు వచ్చారు.
నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ లేదు అన్నారు. గత వారం తాను తీవ్రమైన జ్వరంతో బాధపడ్డానని అందుకే అలా ఉన్నానంటూ స్పష్టం చేశారు. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకొక విషయం అర్థం అయింది. ఇంత మంది నన్ను ప్రేమిస్తున్నారని తెలుసుకుని ధైర్యం వచ్చిందన్నారు విశాల్. తన తండ్రి, కుటుంబం ఇచ్చిన సపోర్టు వల్లే ఈ రోజు ఇలా ధైర్యంగా ఉన్నానని తెలిపారు. వాస్తవానికి ఆ రోజు ఈవెంట్ కు వెళ్లొద్దని మా ఫ్యామిలీ చెప్పినా సరే కావాలని తానే వెళ్లినట్టు చెప్పారు. ఎందుకంటే మదగజరాజ సినిమా చాలా ఏళ్లుగా ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు దాని ప్రమోషన్స్ కు వెళ్తేనే సినిమా గురించి ప్రచారం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే వెళ్లానని తెలిపారు.
డైరెక్టర్ సుందర్ కష్టం ముందు తన జ్వరం పెద్ద సమస్య కాదని గుర్తించి అలా వచ్చినట్టు తెలిపారు విశాల్. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సినిమాలు ఆపేసి తాను విశ్రాంతి తీసుకుంటున్నట్టు చాలా మంది ప్రచారం చేస్తున్నారని.. కానీ తనకు సినిమాల పట్ల ఉన్న పాషన్ తోనే మంచి సినిమాలు చేయాలని బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపారు విశాల్. ఇక మదగజరాజు సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. కానీ 12 ఏళ్లుగా అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జనవరి 12న ఆదివారం రిలీజ్ అవుతోంది. ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.
విశాల్ నుంచి ఓ మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. దాంతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.