ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఓటీటీలు వచ్చి సినిమా గ్లోబల్ రీచ్ అయింది. కానీ.. దీనికంటే ఎన్నోఏళ్ల ముందే తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే భాషా భేదం లేకుండా ఆదరిస్తారని దేశంలోని ప్రతి సినీ పరిశ్రమ చెప్పే మాట. అలా మెచ్చిన హీరో కార్తీ. తమిళ హీరో శివకుమార్ రెండో కుమారుడు. స్టార్ హీరో సూర్యకు తమ్ముడు. రజినీకాంత్, కమల్ హాసన్ తరం తర్వాత విక్రమ్, సూర్య వంటివారికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. వీరికి ధీటుగా కార్తీ కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి కంటెంట్ సినిమాలతో మిగిలిన హీరోలు రికగ్నిషన్ పొందితే.. సాధారణ సినిమాలే చేసినా తన మార్క్ యాక్షన్, లుక్స్, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు కార్తీ. నేడు ఆయన పుట్టినరోజు.
తెలుగువారినీ మెప్పించి..
తొలి సినిమా పరుత్తివీరన్ తోనే ప్రేక్షకులను మెప్పించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేసిన యుగపురుషుడుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీ. ఎంతంటే సినిమాలోని ‘ఎవర్రా మీరంతా..’ అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా రౌండ్ అయ్యేంతగా. కార్తీ తన సినిమాల్లో చలాకీగా నటిస్తాడు. మాస్ ను మెప్పించే లక్షణాలు, ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే నటన కార్తీ సొంతం. అదే అటు తమిళ ప్రేక్షకుల్ని ఇటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ముఖ్యంగా కార్తీ తెలుగులో మాట్లాడే విధానం మరింతగా ఆకట్టుకుంటుంది. అదే తెలుగులో కూడా కార్తీకి అభిమానుల్ని సంపాదించిపెట్టింది. తమిళంలో అప్పటికే స్టార్ హీరోలుగా ఉన్నవారికి కూడా లేనంతగా తెలుగులో కార్తీ మార్కెట్ ఉంది.
నటనలో సత్తా చూపి..
కార్తీ సినిమాలు ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతాయి. తెలుగు స్ట్రెయిట్ సినిమా ఊపిరితో ఆకట్టుకున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీతో కార్తీ తన నటనలోని సత్తా చూపాడు. పొన్నియన్ సెల్వన్ లో అల్లరి పాత్రతో మెప్పించాడు. స్టార్ హీరో తమ్ముడనే గుర్తింపు నుంచి బయటకొచ్చి పేరు తెచ్చుకోవడం పవన్ కల్యాణ్, పునీత్ రాజ్ కుమార్ తర్వాత కార్తీనే అని కింగ్ నాగార్జున అన్న మాట నిజం. తెలుగులో కార్తీకి ఉన్న క్రేజ్.. ఓ సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ వస్తే ఈలలు గోల చేసేంత. ‘ఎవర్రా.. మీరంతా.. నన్ను ఇంత అభిమానిస్తున్నారు’ అని వారిని ఆప్యాయంగా పలకరించేంత. భవిష్యత్తులో కార్తీ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.