యూట్యూబర్ నుంచి కలర్ ఫొటోతో హీరోగా మారిన సుహాస్ పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా నటించాడు. తాను హీరోగా వస్తున్న రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న విడుదల అవుతోంది. దీంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
‘అబ్బో.. ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ..! సినిమాలు తప్ప పుస్తకాలు పట్టించుకోకపోవడం.. కాలేజీ మానేసి మార్నింగ్, మ్యాట్నీ షోలకు వెళ్లడం.. చిరిగిపోయే టికెట్ కోసం లైన్ లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయడం.. ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం.. సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగడం.. వచ్చిన అరకొర వేషాలతో కడుపునిండక, భవిష్యత్తు కనపడక, కళ్లు నీటితో నిండిపోవడం, యూట్యూబ్ నుంచి దూరంగా, హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునేలోపే వెండితెర వెయిటింగ్ లో పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కావడం.. దానికి జాతీయ అవార్డు రావడం..’.
‘ఫైనల్ గా విజయవాడకు దూరంగా, సినిమాకు దగ్గరగా.. సుమారు పదేళ్ల ప్రయాణం తర్వాత.. ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి ధియేటర్ రిలీజ్ మొదటి ప్రీమియర్ పడటం.. అబ్బో ఈ ఫీలింగ్ ఏంటో మామూలుగా లేదుగా రా సుహాసూ..’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.