టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో హేమ పేరును చేర్చారు. ఆమె MDMA డ్రగ్స్ సేవించినట్లు అందులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టులను కూడా చార్జిషీట్ కు అటాచ్ చేశారు. NDPS సెక్షన్ -27 కింద హేమను నిందితురాలిగా చేర్చారు. మొత్తం 88 మంది పేర్లను ఇందులో పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీలతో ఛార్జ్ షీట్ ను రెడీ చేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్( MAA) చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెను ” మా” నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసులో తాను నిర్దోషినంటూ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ హేమ అసోసియేషన్ ను ఆశ్రయించింది. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా అసోసియేషన్ ముందు ఉంచింది. వాటిని పరిశీలించిన “మా” అసోసియేషన్ ఇటీవలే ఆమె పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇప్పుడు ఈ తాజా పరిణామంతో హేమ భవిష్యత్తు గురించి “మా” ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.