వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతోంది. 6కి.మీ మేర క్యూలైన్లు ఉన్నాయి. ప్రస్తుతం క్యూలైన్ రింగ్ రోడ్డు దాటింది. శ్రీవారి దర్శనానికి సుమారు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తులు గ్రహించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. రద్దీకి అనుగుణంగా తమ ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవాలని.. లేదంటే వాయిదా వేసుకోవాలని కోరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆగస్టు 21వ తేదీ వరకూ బ్రేక్ దర్శనం రద్దు చేసింది.
ఐదు రోజులుగా సెలవులు, వివాహాలు ఎక్కువగా ఉండటంతో భక్తుల రాక పెరిగింది. శనివారం రాత్రి నుంచి తిరుమలకు భక్తుల రాక పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, సేవాసదన్ దాటి రింగ్ రోడ్డు వరకూ భక్తులు బారులు తీరి ఉన్నారు. శనివారం 83,422 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా భక్తులు 4.27కోట్ల కానుకలు శ్రీవారికి సమర్పించారు.