బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. అది వాయుగుండంగా మారడంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆ ప్రభావం వల్ల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఈశాన్య, తూర్పు జిల్లాలైన కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శుక్రవారం రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయి. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. శనివారం కూడా వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పింది.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్ గడ్ లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు ఈ ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం 24 గేట్లు ఎత్తి 59 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
మరోవైపు వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వాగులు వంకలు, పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పచ్చి చేరుతుండటంతో భద్రాచలంలో గోదావరి వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.