బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశా తీరంలో శనివారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. ఆదివారం సాయంత్రానికి అది చత్తీస్ గడ్, ఒడిశా తీరాలవైపు ప్రయాణిస్తూ మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పేర్కొంది. గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. శనివారం వర్షం ప్రభావం తక్కువగానే ఉన్నా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలోని పలుచోట్ల రోడ్లు కోతకి గురికావడంతో వందలాది గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, హన్మకొండ అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. సిరిసిల్ల, అదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.