ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తన ద్రోణి ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడనందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ కోస్తా, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. ఈ కారణంగా రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు పడనుండటంతో రైతులు, కూలీలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని కోరింది. సముద్రంలో అలజడి రేగడంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పింది.
భారీ వర్షాల నేపథ్యంలోఏపీ హోంశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పోలీసు శాఖ, విపత్తుల నిర్వహణ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించారు. భారీ గండ్లు ఏర్పడే ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి అక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆమె కలెక్టర్లకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఆస్తి నష్టం, ప్రాణా నష్టం సంభవించకుండా చూడాలని కోరారు.