రాజకీయం అంటే బూతు మాత్రమే.. అనే స్థాయికి వైసీపీ హయాంలో రాజకీయాన్ని వైసీపీ దిగజార్చేసింది. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. రాష్ట్రంలో బూతు బాగోతం నడిపారడం అతిశయోక్తి కాదేమో.! రాజకీయ నాయకులు మీడియా ముందుకొస్తే చాలు ‘బూతులు బాబోయ్’ అని మీడియా ప్రతినిథులు నెత్తీ నోరూ బాదుకునే పరిస్థితులు అప్పట్లో చూశాం.
మహిళా జర్నలిస్టులతో ఇంటర్వ్యూల సమయంలో కూడా వైసీపీ నేతలు (అప్పట్లో మంత్రులుగా వున్నవారు) బూతులు మాట్లాడటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బూతులు తిట్టడం, అది గ్రామీణ భాష.. అంటూ బుకాయించడం.. ఈ తతంగం అత్యంత జుగుప్సాకరంగా తయారైంది.
కానీ, గడచిన రెండున్నర నెలలుగా రాష్ట్రంలో బూతులకు కాలం చెల్లింది. మంత్రులెవరూ బూతులు మాట్లాడటం లేదు. ఎమ్మెల్యేలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రెస్ మీట్లు.. అంటే, అంశాల వారీగానే జరుగుతున్నాయ్. వైసీపీ నుంచి ప్రజా ప్రతినిథులు పెద్దగా మీడియా ముందుకు రావడంలేదనుకోండి.. అది వేరే సంగతి.
ఒకరిద్దరు వచ్చినా, బూతులు మాట్లాడటంలేదిప్పుడు.
‘గతంలో ఫలానా రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే, అత్యంత ఇబ్బందికరంగా వుండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..’ అని మహిళా జర్నలిస్టులు ఓ వైసీపీ నాయకుడి గురించి చర్చించుకుంటున్నారు. నిజానికి, అప్పట్లో బూతులు మాట్లాడిన వైసీపీ నాయకులు కొందరు ఇప్పుడు అజ్ఞాతంలో వున్నారు.
ఏమో, ముందు ముందు పరిస్థితులు ఎలా వుంటాయోగానీ, ఇప్పటికైతే రాష్ట్రంలో రాజకీయాలు ఒకింత ప్రశాంతంగా వున్నాయ్.. బూతుల కోణంలో చూస్తే. బూతుల్ని బ్యాన్ చేసినట్లుగా రాజకీయాలు నడుస్తుండడం అభినందనీయమే.
వైసీపీ అత్యంత దారుణంగా ఓడిపోవడంలో ఈ బూతులు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు మరి.!