అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’. ఈ రెండు నిర్మాణ సంస్థలు నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 9, 2012న విడుదలైన ‘జులాయి’తో ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించి, మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొని, మంచి అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పదేళ్ల సినీ ప్రస్థానంలో ఈ సంస్థల నుంచి 16 సినిమాలు రాగా, అందులో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం విశేషం. ‘జులాయి’ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అన్ని చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండటం విశేషం. ఇక సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా యువ ప్రతిభకు పెద్ద పీట వేస్తుంటారు. ఈ పదేళ్లలో ఈ రెండు బ్యానర్స్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అఆ’, ‘ప్రేమమ్’, ‘అరవింద సమేత’, ‘జెర్సీ’, ‘భీష్మ’, ‘భీమ్లా నాయక్’, ‘డీజే టిల్లు’, ‘అల వైకుంఠపురములో’ ఇలా పదికి పైగా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ మరియు నాగవంశీలు వీడియోను షేర్ చేశారు.