పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హరి హర వీరమల్లు. 16వ శతాబ్దంలో జరిగిన కథ. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథలో హిందువులపై దాడి చేసే మొఘలులపై తిరగబడి హిందూత్వాన్ని కాపాడే యోధుడిగా, ధనవంతుల దగ్గర దోచుకుని పేదవారికి పంచిపెట్టే దొంగగా పవన్ కల్యాణ్ నటించారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మాతగా సినిమా తెరకెక్కింది. కీరవాణి సంగీతం అందించారు.
కథ:
దేశ సంపదను కొల్లగొట్టే బ్రిటిషర్ల నుంచి దేశ సంపద కాపాడుతూ.. పేదలకు పంచిపెట్టే దొంగగా, కోహినూర్ వజ్రాన్ని కొల్లగొట్టిన మొఘలుల నుంచి తిరిగి తీసుకొచ్చే క్రమంలో హిందువులను కాపాడుతూ.. హైందవ ధర్మాన్ని పరిరక్షించే యోధుఢి కథ. ఢిల్లీ నుంచి కోహినూర్ వజ్రాన్నీ తీసుకొచ్చే క్రమంలో వీరమల్లుకు ఎదురైన సవాళ్లేంటి, హిందువులపై, హైందవ ధర్మంపై దాడి చేస్తూ పన్నులు కట్టాల్సిందేనని హింసించే ఔరంగజేబును ఎలా ఢీకొట్టాడన్నదే కథ.
ఎవరెలా చేశారంటే..?
సినిమా పూర్తిగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో. దొంగగా, హైందవ ధర్యాన్ని కాపాడే యోధుడి పాత్రలో ఒదిగిపోయారు. తనదైన స్టయిల్, స్వాగ్ తో ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చారు. వీరమల్లు మేకోవర్ లో చక్కగా ఫిట్ అయ్యారు. సినిమాకి ప్రధాన ఆకర్షణ ఫైట్స్. పవన్ కల్యాణ్ డిజైన్ చేసిన ఫైట్స్, ఆయన నటించిన విధానం అదరగొట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఎంట్రీ ఫైట్, మల్లయోధులతో ఫైట్.. ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్. ప్రీ ఇంటర్వెల్ చార్మినార్ ఫైట్ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. సెకండాఫ్ లో పవన్ కల్యాణ్ పులితో తోడేలుతో పోరాడే సన్నివేశాల్లో ఆయన నటన, మార్షల్ ఆర్ట్స్ లో తన నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించి సన్నివేశాల్ని చక్కగా పండించారు.
సెకండాఫ్ లో హైందవ ధర్మాన్ని రక్షించే యోధుడిగా వచ్చే ఫైట్ మరో హైలైట్. అప్పుడప్పుడూ తన కామెడీ టైమింగ్ తో అలరించారు. సినిమాలో ప్రేక్షకులు లీనమైన సన్నివేశాలు అన్నిటిలోనూ పవన్ కల్యాణ్ కూర్చోబెట్టినవేనని చెప్పాలి.
నిధి అగర్వాల్ పర్వాలేదనిపించే నటన ప్రదర్శించారు. కానీ, సినిమాలో ఆమె పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. అయితే.. ఓ కీలకమైన సన్నివేశంలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.
నాజర్, సత్యరాజ్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, కబీర్ దుహాన్ సింగ్.. ఇలా సహ నటులంతా తమదైన నటనతో సినిమాలో భాగమయ్యారు. వీరంతా కీలక పాత్రల్లో నటిస్తూనే మధ్యమధ్యలో తమ కామెడీ టైమింగ్ తో ఉత్సాహపరిచారు.
ఔరంగజేబుగా తన పాత్రలో ఇమిడిపోయారు బాబీ డియోల్. సినిమాలో ఆయన పాత్ర కీలకమే అయినా.. పూర్తిస్థాయిలో పాత్ర తెరపై రాలేదనే చెప్పాలి. సెకండ్ పార్ట్ లో ఆయన విలనిజం మరింతగా ఉండనుందని చెప్పొచ్చు. తన పరిధిలో పాత్రలో లీనమై నటించారు.
కథగా.. కోహినూర్ వజ్రాన్ని ఢిల్లీలోని ఔరంగజేబు నుంచి హైదరాబాద్ గోల్కొండ నవాబు దగ్గరకి తీసుకొచ్చేలా రాసుకున్నారు. ఇదే లైన్ ని సింగిల్ పార్టులో చెప్పాల్సిన కథ అనిపిస్తుంది. కానీ, వజ్రాల దొంగగా ఎందుకు మారాడు, నవాబుకి ఎందుకు దొరికాడనే ప్రశ్నలకు సెకండాఫ్ లో హిందూత్వాన్ని కాపాడే వీరమల్లుగా చూపించారు. దీంతో సినిమా లైన్ కొంత గాడి తప్పిందని చెప్పాలి. సెకండాఫ్ లో ఎక్కువగా దీనిపైనే దృష్టి పెట్టడంతో కోహినూర్ వజ్రం అనే కాన్సెప్ట్ కి సెకండ్ పార్ట్ అవసరమొచ్చిందని అనిపిస్తుంది. దీంతో ఫస్టాఫ్ లో మెప్పించిన కథ, స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో కొంత కొరవడిందనే చెప్పాలి.
సంగీతంలో కీరవాణి అక్కడక్కడ నిరుత్సాహ పరిచారు అని చెప్పాలి. రాజమౌళి సినిమాలకు ఇచ్చేంత సంగీతం, అర్ధమయ్యేలా పాటలు, బీజిఎమ్ ఇచ్చే ఆయన నుంచి.. ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించే వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. ఊదరగొట్టే బీజీఎమ్ ఇచ్చినా, కొన్ని చోట్ల సంగీతం వినసొంపుగా లేదనే చెప్పాలి.
సినిమాటోగ్రఫీ పర్వాలేదని చెప్పాలి. జ్ఞానశేఖర్ కొంత, మనోజ్ పరమహంస కొంత చిత్రీకరించారు. ఎక్కువగా గ్రీన్ మ్యాట్ లో చేయడం, వీఎఫ్ఎక్స్ కొంత తేలిపోవడంతో కెమెరా పనితనం ఓకే అని చెప్పాలి. చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా వస్తున్న రోజుల్లో పెద్ద హీరో, పెద్ద బడ్జెట్ కాబట్టి మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది.
క్రిష్ రాసుకున్న కథను కొంత ఆయన తెరకెక్కించి.. జ్యోతికృష్ణ రంగంలోకి వచ్చాక మరికొంత కథలో మార్పులు, స్క్రీన్ ప్లేలో మార్పులు క్లియర్ గా తెలుస్తాయి. సాయిమాధవ్ మాటలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
పవన్ కల్యాణ్
పులి-తోడేలుతో సన్నివేశాలు
మల్లయోధుల ఫైట్
చార్మినార్ ఫైట్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
వీఎఫ్ఎక్స్
లవ్ ట్రాక్
బీజీఎమ్ ఓవర్ డోస్
ఫైనల్ గా:
హరి హర వీరమల్లుని పవన్ కల్యాణ్ ఒంటిచేత్తో నడిపించారు. మొదటిసారి పిరియాడికల్ ఫిల్మ్ చేస్తూనే ఆకట్టుకునే లుక్, పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ముఖ్యంగా హైందవ ధర్మ పరిరక్షకుడిగా, మొఘలుల అన్యాయాలపై తిరగబడే పాత్రలో చక్కగా నటించారు. ఫైట్స్ లో ఆయన మార్క్ మార్షల్ ఆర్ట్స్ షాట్స్ తో అలరించారు. తన మార్క్ డైలాగ్ డిక్షన్ తో ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ సెకండాఫ్ కాస్త గాడి తప్పకుండా కోహినూర్ వజ్రం చుట్టూనే తీప్పి సింగిల్ పార్ట్ లో కథ ముగించేలా చేయచ్చు. అయితే.. హైందవ ధర్మ పరిరక్షణకు కథను జోడించారు. ఇందులో ఆయన నిజజీవిత భావజాలం కనిపిస్తుంది. మొత్తంగా పవన్ కల్యాణ్ నుంచి ఒక సాలిడ్ సినిమా వచ్చిందనే చెప్పాలి. ప్రేక్షకులకి అర్ధమయ్యే కంటెంట్ తీసుకున్నారు. క్లైమాక్స్ కాస్తంత ఎఫెక్టివ్ గా చెప్పుంటే క్యూరియాసిటీ మరింత పెంచేవారు. మొత్తంగా పవన్ కల్యాణ్, చరిత్ర, హైందవ పరిరక్షణ అంశాలతో ముడిపడిన సినిమా.
తెలుగు బులెటిన్ రివ్యూ: 2.75/5
