పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి వాయిదా వేశారు. మొదట మార్చి 28వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల మూవీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది రిలీజ్ అవుతున్న భారీ సినిమాల్లో వీరమల్లు కూడా ఒకటి. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే దీని షూటింగ్ జరుగుతోంది.
ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మూవీని మార్చి 28వ తేదీన విడుదల చేయలేకపోతున్నామని మూవీ టీమ్ ప్రకటించింది. మే 9న రిలీజ్ చేస్తామని కొత్త డేట్ ప్రకటించింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం అనే కాన్సెప్టు ద్వారా తీస్తున్నారు. ఇందులో ప్రజల తరఫున న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా పవన్ కల్యాణ్ ను చూపించబోతున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఎ.ఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత శరవేగంగా మూవీ షూటింగ్ జరుగుతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి.