Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. మార్చి 28న విడుదలవుతున్న సినిమా నుంచి మొదటి పాట ‘మాట వినాలి..’ విడుదల చేసారు మేకర్స్. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పాట పాడటం విశేషం. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎ. దయాకర్ రావు సినిమాను నిర్మిస్తున్నారు.
పెంచల్ దాస్ అందించిన సాహిత్యంతో “వినాలి.. వీరమల్లు మాట చెప్తే వినాలి” అంటూ తెలంగాణ మాండలికంలో పాట ప్రారంభమయింది. అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్స్, లోతైన భావం, జ్ఞానం ప్రాముఖ్యత, అద్భుతమైన సందేశంతో అందరూ పాడుకునేలా పాట ఉందని చెప్పాలి. విజువల్స్ పరంగా అటవీ నేపథ్యంలో చిత్రీకరించడంతో పాట మరింత ఆకట్టుకుంటోంది. అడవిలో మంట.. చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం, పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
‘హరి హర వీరమల్లు’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలవుతోంది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు.