రాజకీయం మరీ ఇంతలా దిగజారిపోతుందా.? ఏ కాలంలో వున్నారు మీరంతా.? ఆల్రెడీ దిగజారిపోయింది. ఆడా లేదు, మగా లేదు.. సిగ్గు లేకుండా తిట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి, ఈ ఛండాలమేంటి.? ఈ బూతులేంటి.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని చూసి.
అసలు విషయానికొస్తే, ఆయనో మంత్రి. ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళా నేతని, ‘పరిగెట్టించి కొడతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయనదో సాదా సీదా నాయకుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. మరీ దారుణమేంటంటే, ఆయన మంత్రి.. ఆయన ఎవరో కాదు, గుడివాడ అమర్నాథ్.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనిత మీద గుడివాడ అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా, భారతమ్మ మీదా నోరు పారేసుకుంటే, పరిగెట్టించి కొడతాం..’ అని అనితకి గుడివాడ అమర్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడే వున్న వైసీపీ క్యాడర్, వైసీపీ నేతలు.. ఆయన హీరోయిజం చూసి క్లాప్స్ కొట్టేశారు.
ఇది హీరోయిజం ఏంటి.? ఆయన మంత్రి ఏంటి.? ఇంతకీ, పోలీస్ వ్యవస్థ ఏంటి.? ఓ మహిళా నాయకురాల్ని ఓ రాజకీయ నాయకుడు.. పరిగెత్తించి కొడతానంటూ బహిరంగంగా హెచ్చరిస్తోంటే, రాష్ట్ర మహిలా కమిషన్ ఛైర్ పర్సన్ ఏం చేస్తున్నట్లు.?
మహిళా పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు.? మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి.? చంద్రబాబు సతీమణి మీద వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. నారా లోకేష్ సతీమణి మీద కూడా.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించీ, జీవిత భాగస్వామి గురించీ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం.
మరి, టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు, నేతలు ఏం చేయాలని గుడివాడ అమర్నాథ్ కోరుకుంటున్నట్టు.? ఆయన చెప్పినట్టే పరిగెత్తించి కొడితే.. కుదురుతుందా ప్రజాస్వామ్యంలో.?