గెలిచేదాకా ఒక లెక్క.. గెలిచాక ఇంకో లెక్క.! ఔను, జనసేన పార్టీకి గ్రౌండ్ లెవల్‌లో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఇది.! ‘ఆయన కూడా ఇతర రాజకీయ నాయకుల్లానే అనుకున్నాం.. కానీ, ఆయన భిన్నం. పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్..’ అంటూ ఊరూ వాడా జనం చర్చించుకుంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పంచాయితీ రాజ్ సహా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా డిప్యూటీ సీఎం అంటే, ఒకప్పుడు ‘పేపర్ వెయిట్’ అనే భావన వుండేది. గత ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంలకు దక్కిన గౌరవం అంత హేయమైనది.
కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నేపథ్యంలో హోం శాఖ పని తీరుని జనసేనాని ప్రశ్నించిన తీరు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముంది.?’ అని సాక్షాత్తూ హోంమంత్రి స్పందించిన దరిమిలా, ‘ఇలా అడిగే నాయకుడు లేకనే అఘాయిత్యాలు పెరుగుతూ వచ్చాయ్..’ అని జనం పవన్ కళ్యాణ్‌కి ‘జై’ కొట్టారు.
ఇక, గ్రామాల్లో సీసీ రోడ్లు సహా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సర్పంచ్‌లకు దక్కుతున్న గౌరవం.. ఆయా శాఖల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్న తీరు.. ఇవన్నీ, పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమని జనం బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో జనసేనాని పొందగలిగారు.. తన చర్యల ద్వారా.
విజయవాడలో వరదలొస్తే, కోటి రూపాయల ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్రకటించడంతోపాటు, మరో నాలుగు కోట్లు ఆయా గ్రామాల్లో ప్రజావసరాల నిమిత్తం ఖర్చు చేసేందుకు విరాళమిచ్చి జనసేనాని మిగతా రాజకీయ నాయకుల కంటే చాలా భిన్నం.. అనే గుర్తింపు సంపాదించుకోగలిగారు.
చూస్తుండగానే రోజులు, నెలలు గడిచిపోతున్నాయ్. ఏ సమస్య తన దృష్టికి వచ్చినా, క్షణాల వ్యవధిలో ఆ సమస్యలకు పరిష్కారం వెతికేందుకు జనసేనాని చేస్తున్న కృషి నిజంగానే అభినందనీయమని జనం మాట్లాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లోనే జనసేనానిని గెలిపించుకుని వుంటే బావుండేదన్నది రాష్ట్ర ప్రజల భావన.
మరీ ముఖ్యంగా, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ‘మేం ఆయన్ని గెలిపించుకోలేకపోయాం..’ అని గాజువాక, భీమవరం ప్రజలు ఆవేదన చెందుతున్నారంటే, ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం పట్ల జనసేనాని చూపిస్తున్న శ్రద్ధ అలాంటిది.
తాజాగా, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి ‘సీజ్ ది షిప్’ అంటూ జనసేనాని నినదించిన వైనం, ఆయన గట్స్‌కి నిదర్శనం. నాయకులు గెలుస్తారు, ఓడుతారు.. ప్రభుత్వాలు వస్తాయ్ పోతాయ్.. కానీ, పవన్ కళ్యాణ్ ఈజ్ సమ్‌థింగ్ వెరీ స్పెషల్.!
21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్ సభ సీట్లతోనే జనసేన పార్టీ ఈ స్థాయి మార్పుని చూపించగలుగుతోందంటే, ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగితే, రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందన్నది నిర్వివాదాంశం.