‘ఎక్స్ ఎంపీని నేను.. దేశానికి ఎంపీగా పని చేశాను.. నాతో ఇలాగేనా వ్యవహరించేది.?’ అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇదేం పద్ధతి.? అంటూ, గోరంట్లపై మండిపడుతున్నారంతా.
పూర్వాశ్రమంలో గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారిగా పని చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై అప్పట్లో గోరంట్ల మాధవ్ వివాదాస్పద తీరు అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ వివాదాస్పద తీరు నచ్చి, గోరంట్ల మాధవ్‌ని వైసీపీలోకి తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
గోరంట్ల మాధవ్, పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేయడం, రాజకీయాల్లోకి రావడం.. ఈ క్రమంలో నడిచిన హైడ్రామా.. అందరికీ గుర్తుండే వుంటుంది. పోలీసు శాఖలో కొందర్ని వైసీపీ ఎలా తమకు అనుకూలంగా వాడుకుంటుందనడానికి గోరంట్ల మాధవ్ ఉదంతమే నిదర్శనం.
అప్పట్లో ప్రజా ప్రతినిథి అయిన జేసీ దివాకర్ రెడ్డిపై ‘నువ్వు ప్రజా ప్రతినిథివైతే, నేను పోలీస్.. బస్తీ మే సవాల్’ అంటూ గోరంట్ల మాధవ్ చెలరేగిపోయారు. మరిప్పుడు, గోరంట్ల మాధవ్ జస్ట్ మాజీ ఎంపీ అంతే. మరి, పోలీసులు.. తమ విధి నిర్వహణకు అడ్డం వచ్చిన గోరంట్ల మాధవ్‌పై తగిన చర్యలు తీసుకోవాలి కదా.?
పోలీసు కస్టడీలో వున్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించారు గోరంట్ల మాధవ్. ఇది నేరపూరిత చర్య. అందుకే, న్యాయస్థానం కూడా గోరంట్ల మాధవ్‌కి రిమాండ్ విధించింది.
పోలీస్ అధికారిగా, ఏం చేస్తే ఏం జరుగుతందని తెలిసీ, గోరంట్ల మాధవ్ రౌడీయిజం ప్రదర్శించి, తిరిగి పోలీసుల మీదనే విరుచుకుపడుతున్నారంటే.. ఒకింత ఆలోచించాల్సిన విషయమే ఇది. ప్రజా ప్రతినిథులకు కొమ్ములుండవ్.. ప్రజా ప్రతినిథులు మరింత బాధ్యతగా వుండి, రోల్ మోడల్.. అనిపించుకోవాలి. రౌడీయిజం ప్రదర్శించకూడదు.
