ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయనగానే.. తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయని అంతా అనుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ ఇప్పటికే విడుదల కాగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల కాబోతోంది.!
‘గేమ్ ఛేంజర్’ సినిమాకి తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, వసూళ్ళు సాయంత్రానికే అనూహ్యంగా పుంజుకున్నాయ్. ‘డాకు మహరాజ్’ సినిమాకి టాక్ ఎలా వున్నా, సంక్రాంతి సీజన్‌లో నెట్టుకుపోయే పరిస్థితి వుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎలా వుండబోతోందన్నది ముందు ముందు తేలుతుంది.
అయితే, ఈసారి సంక్రాంతి సినిమాలు థియేటర్లలో కంటే, సంక్రాంతి బస్సుల్లో ఎక్కువగా ప్లే అవుతుండడం గమనార్హం. ‘గేమ్ ఛేంజర్’ హెచ్‌డీ ప్రింట్స్ లీక్ అయిపోయాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో సినిమాని పెట్టేశారు కొందరు. బస్సుల్లో అయితే రిపీటెడ్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాని ప్రదర్శిస్తుండడం గమనార్హం.
‘డాకు మహరాజ్’ది కూడా ఇదే పరిస్థితి. దాంతో, థియేటర్లకు మొహమాటంగానే వస్తున్నారు ప్రేక్షకులు రెండు సినిమాలకీ.
తెలుగు సినిమాకి పైరసీ ఎంత శాపంగా మారిందన్నది కొత్తగా ఇప్పుడు చెప్పేదేముంది.? కానీ, సంక్రాంతి సినిమాల పైరసీ విషయమై ఆయా చిత్రాల నిర్మాతలు అంత ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకున్నట్లు కనిపించడంలేదు.
గతంలో అయితే, సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు దర్శనమిస్తేనే, రిపోర్ట్ కొట్టేసి, అకౌంట్లు బ్లాక్ చేయించే పరిస్థితి వుండేది.
ప్రధానంగా ‘గేమ్ ఛేంజర్’ మీద పెద్దయెత్తున కుట్ర జరిగింది. కానీ, నిర్మాత దిల్ రాజు పూర్తిగా లైట్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పైరసీని అదుపు చేయలేని పరిస్థితి వుంటే, ముందు ముందు థియేట్రికల్ రిలీజ్‌ని నిర్మాతలు మర్చిపోవడం బెటర్.!