శుభలగ్నం సినిమా గుర్తుందా? అందులో ఆమని తన భర్తను రూ.కోటికి రోజాకి అమ్మేస్తుంది. మొగుడి చాలీచాలని సంపాదనతో పడుతున్న కష్టాలు పోగొట్టుకోవడం కోసం తన మంగళసూత్రాన్ని అంగడి సరుకుగా మార్చేస్తుంది. తర్వాత ఎదురయ్యే కష్టాలు అవీ.. అదంతా వేరే సంగతి. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ చిన్న మార్పు ఏమిటంటే.. పెళ్లి కాకుండానే ఆమె తన కాబోయే భర్తను అమ్మేసింది. అది కూడా ఎవరికో తెలుసా? తనకు కాబోయి మిస్సయిపోయిన అత్తకి.
అమెరికాకి చెందిన ఓ యువతి కాలేజీ రోజుల నుంచి తన సహ విద్యార్థితో ప్రేమలో పడింది. కొంతకాలం సహజీవనం కూడా చేసింది. ఈ క్రమంలో ఇరువురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. షరా మామూలుగానే అక్కడ కూడా వీరి పెళ్లికి అబ్బాయి తరఫు పెద్దలు అభ్యంతరం చెప్పారు. అయినా కూడా వారిని ఒప్పించి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలైంది. అప్పటివరకు బాగానే ఉన్న వీరిద్దరి మధ్యా చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. నువ్వు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పి వెళ్లాల్సిందేనని అబ్బాయి.. నువ్వు పార్టీలు, పబ్బులంటూ వెళ్లి పీకలదాకా తాగావో ఊరుకునేది లేదని అమ్మాయి.. తగవులాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో అబ్బాయి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ యువతి.. ఇక అతడికి బ్రేకప్ చెప్పేయాలని డిసైడ్ అయింది.
ఇక ఈ విషయం ప్రియుడికి చెబుదాం అనుకునే సమయంలో ఆమెకు కాబోయే అత్త నుంచి ఫోన్ వచ్చింది. తన కొడుకుని వదిలేస్తే 10వేల డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. బ్రేకప్ చెప్పేద్దామని డిసైడ్ అయిన సమయంలో భలే మంచి ఆఫర్ వచ్చిందని ఆ యువతి సంబరపడింది. వెంటనే కాబోయే అత్త ఇచ్చిన ఆఫర్ కు ఓకే చెప్పింది. ఆమె నుంచి 10వేల డాలర్లు (దాదాపు రూ.7 లక్షలు) అందుకున్న వెంటనే కాబోయే మొగుడికి గుడ్ బై చెప్పేసింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘మేం ఇద్దరం చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నాం. కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాం. ఇటీవలే మాకు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే, అతడి తల్లిదండ్రులకు నేనంటే అస్సలు ఇష్టంలేదు. తన కుమారుడిని వదిలేయాలంటూ చాలాసార్లు చెప్పారు. కానీ నేను పట్టించుకోలేదు. అయితే, ఎంగేజ్ మెంట్ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రతిదానికీ ఆరా తీయడం మొదలుపెట్టాడు. నాపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నించాడు. నేను ఎక్కడకు వెళ్లాలన్నా చెప్పి వెళ్లాలని, రోజులో ఎక్కడ ఎంత సేపు ఉన్నానో ప్రతి విషయం తనకు తెలియాలని ఆర్డర్ వేశాడు. ఇది నాకు నచ్చలేదు. పైగా అతడు పెద్ద తాగుబోతుగా మారిపోయాడు. ఇలాంటి వాడితో నా జీవితం హ్యాపీగా ఉండదని భావించి, బ్రేకప్ చెబుదామని నిర్ణయించుకున్నాను. ఈలోగా అతడి అమ్మ నుంచి నాకు ఫోన్ వచ్చింది. తన కొడుకుని పెళ్లి చేసుకోకుండా వదిలేసి వెళ్లిపోతే 10వేల డాలర్లు ఇస్తానని చెప్పింది. ఇది బాగానే ఉందని భావించి అందుకు అంగీకరించాను. అయితే, ఈ విషయం తన కొడుకుని తెలియకూడదని ఆమె షరతు విధించింది. అందుకే అతడికి అసలు విషయం చెప్పకుండా బ్రేకప్ చెప్పి వచ్చేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది’ అని వివరించింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమ్మాయికి మద్దతు పలుకుతుండగా.. ప్రేమను మోసం చేయడం తప్పని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ విషయం వైరల్ గా మారింది.
