రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ సినిమాపై అంచనాలు బాగానే కన్పిస్తున్నాయి. అయితే, ట్రైలర్ విషయంలో కొంత గందరగోళం చోటు చేసుకుంది. నిన్ననే విడుదల కావాల్సిన ట్రైలర్ కొన్ని కారణాలతో నేటికి వాయిదా పడింది. ప్లానింగ్ బెడిసికొట్టి ట్రైలర్ ఈవెంట్ నిన్న జరిగిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే, ‘కల్కి’ గురించి మాట్లాడుతూ, తన తదుపరి సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు హీరో రాజశేఖర్. ఆ తదుపరి సినిమా ఇంకోటేదో కాదు, ‘గరుడ వేగ’ సీక్వెల్.
చాలాకాలం తర్వాత రాజశేఖర్‌కి ‘గరుడ వేగ’ సినిమాతో హిట్ వచ్చిన విషయం విదితమే. దానికి సీక్వెల్ రూపొందించే ప్లాన్‌లో వున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆ పనులు కూడా షురూ అయ్యాయి. అయితే, ఆ కథ గురించిగానీ.. ఇతర వివరాలేవీగానీ తనకు తెలియవని రాజశేఖర్ తేల్చేశాడు. ‘ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత కళ్యాణ్ చూసుకుంటారు.. నాకైతే, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ గురించిన విషయాలు పెద్దగా తెలియదు. కానీ, నేను చేయబోయే తదుపరి సినిమా అదే..’ అంటూ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలామందికి షాక్ ఇస్తున్నాయి.
హీరోకి తెలియకుండా అలా ఎలా జరుగుతుంది? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘గరుడ వేగ’ సినిమాతో రాజశేఖర్‌కి హిట్ వచ్చిన మాట వాస్తవం. కానీ, రాజశేఖర్ మార్కెట్ ఇంకా ‘స్టడీ’ అవలేదు. ‘కల్కి’ సినిమాపై భారీ అంచనాలున్నా, ఫస్ట్ డే టాక్ తర్వాతే రాజశేఖర్ స్టామినా ఏంటన్నది తెలుస్తుంది. బహుశా ఆ తర్వాతే, ‘గరుడ వేగ’ సీక్వెల్ గురించిన పూర్తి క్లారిటీ వస్తుందేమో. ఇదిలా వుంటే, ‘గరుడ వేగ’ సీక్వెల్‌ని ఓ ప్రముఖ హీరో చేయబోతున్నాడనీ, ఇందుకోసం చర్చలు కూడా జరుగుతున్నాయనీ, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఆ ఆ ఆలోచన చేశాడనీ ఆ మధ్య ప్రచారం జరిగింది. మరి, రాజశేఖర్ ఇచ్చిన క్లారిటీతో.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మనసు మార్చుకుంటాడా.? అసలేం జరుగుతోంది ‘గరుడ వేగ’ సీక్వెల్ విషయంలో.?