Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘గేమ్ చేంజర్’. అభిమానులతోపాటు ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.
సంక్రాంతి జనవరి 10న గేమ్ చేంజర్ విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే నవంబర్ 9న టీజర్ విడుదల చేస్తామని ప్రకటించింది యూనిట్. అయితే.. దీనిని చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరాది నగరమైన లక్నోలో ఈవెంట్ ప్లాన్ చేసి టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వేడుకలో రామ్ చరణ్ పాల్గొంటారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ అంతర్జాతీయస్థాయిలో క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఉత్తరాది నుంచి ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. 5ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా సోలో సినిమా.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.