గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను మొదటి నుంచి కావాలనే టార్గెట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు నుంచే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దాదాపు మూడేళ్లు కష్టపడి రామ్ చరణ్, శంకర్ ఈ సినిమాను చేశారు. వందల కోట్ల బడ్జెట్ ను పెట్టారు. అలాంటి సినిమా రిలీజ్ రోజే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. అది కూడా హెచ్ డీ ప్రింట్. రిలీజ్ రోజే లీక్ కావడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగిందని మూవీ టీమ్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా 45 మందితో ఉన్న ఓ ముఠా దీని వెనకాల ఉన్నట్టు మూవీ టీమ్ ఆరోపిస్తోంది.
ఈ 45 మంది ఒక టీమ్ గా ఏర్పడ్డారు. నిర్మాతలతో పాటు సినిమా టీమ్ సభ్యులను వీళ్లు రిలీజ్ కు ముందు నుంచే బెదిరిస్తున్నారంట. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మూవీ పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని చెబుతున్నారు. కానీ మూవీ టీమ్ ఎక్కడా వారికి లొంగలేదు. దాంతో సోషల్ మీడియాలోని కొన్ని పేజీల్లో కావాలనే మూవీ స్టోరీని, అందులోని కీలకమైన ట్విస్టులను లీక్ చేసి తెగ ప్రచారం చేశారు. అక్కడిగో ఆగకుండా ఇప్పుడు రిలీజ్ రోజే హెచ్ డీ ప్రింట్ ను లీక్ చేశారు. ఆ లింకు అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కావాలనే షేర్ చేశారు. అంత పెద్ద బడ్జెట్ సినిమా ఆన్ లైన్ లో వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.
మూవీ టీమ్ వెంటనే ఆ 45 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఈ 45 మంది ఎవరు.. డబ్బుల కోసమే ఇదంతా చేశారా లేదంటే వారి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కావాలనే గేమ్ ఛేంజర్ మీద మొదటి నుంచి సోషల్ మీడియాలోని కొన్ని పేజీల్లో నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. మూవీకి జనాలు వెళ్లకుండా చేస్తున్నారు. దీంతో ఆయా సోషల్ మీడియా పేజీలపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోని స్క్రీన్ షాట్లు, కామెంట్లను పరిశీలిస్తే ఇదంతా కావాలనే చేసినట్టు అర్థం అవుతోందని మూవీ టీమ్ సభ్యులు చెబుతున్నారు.
ఇంత పెద్ద సినిమా విషయంలో ఎవరూ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయరు. ఎందుకంటే మూవీలో ఉన్న వారంతా చాలా పెద్ద వాళ్లు. కాబట్టి ఇదంతా డబ్బుల కోసం కాకుండా చరణ్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.