రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ రావడం, కుట్రపూరితంగా సినిమా హెచ్‌డీ వీడియోని కొందరు లీక్ చేయడం తెలిసిన విషయాలే.
నిర్మాత దిల్ రాజు అయితే, ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై సవతి ప్రేమ చూపించారు. ‘డాకు మహరాజ్’ సినిమాకి పంపిణీదారుడిగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి నిర్మాతగా మాత్రమే వ్యవహరించాడాయన.
మెగాభిమానులు మాత్రం వీలైనంతవరకు ‘గేమ్ ఛేంజర్’ సినిమాని తమ భుజాన మోసేందుకు ప్రయత్నించారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా కొంతమేర ‘గేమ్ ఛేంజర్’ సినిమాని ఆదరించిన మాట వాస్తవం. అయితే హెచ్‌డీ క్వాలిటీతో ‘గేమ్ ఛేంజర్’ సినిమా పైరసీ వీడియో అందుబాటులో వుండడంతో, థియేటర్లకు జనం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
అయినాగానీ, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని కంటెంట్, ప్రస్తుత సమాజానికి అవసరమంటూ కొందరు ప్రముఖులు, ఈ సినిమాని విద్యార్థులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి విద్యార్థుల్ని తీసుకెళుతున్నాయి కొన్ని విద్యా సంస్థలు.
కొందరు ప్రముఖులు కూడా, నేటి యువత ఐఏఎస్ అధికారి ఎలా వుండాలో తెలుసుకుని, స్ఫూర్తి పొందాలంటూ తమ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారు.
తాజాగా, ఏపీలోని తణుకులో ఓ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులకు ‘గేమ్ ఛేంజర్’ సినిమాని చూపించారు. ‘సినిమా అంటే ఇలా వుండాలి.. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలు విజయవంతమవ్వాలి..’ అని సినిమా చూసిన విద్యార్థులు వ్యాఖ్యానించడం గమనార్హం.
హింస, రక్తపాతం, అశ్లీలత.. వంటివి, వెండితెరపై ఎక్కువైపోయిన ఈ రోజుల్లో స్మగ్లర్ల చిత్రాలకు వున్నంత క్రేజ్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్‌కి వుండటంలేదన్నది నిర్వివాదాంశం. వెకిలి కామెడీకి పట్టం కడుతున్న ప్రేక్షకులూ, సమాజానికి పనికొచ్చే సినిమాల విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాలి.