గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారీ సినిమా గేమ్ ఛేంజర్. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న మూవీ కావడంతో పాటు.. శంకర్ దర్శకుడిగా ఉండటం, దిల్ రాజు దాదాపు రూ.350 కోట్లతో నిర్మించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా చేసింది. తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే వచ్చిన టీజర్లు, ట్రైలర్ భారీ హిట్ అయ్యాయి. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ హిట్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
ఆవేశంతో ఉండే కుర్రాడు ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా ఎలా మారాడు.. ఆ తర్వాత ఏం చేశాడు అనేది సినిమా లైన్. స్టూడెంట్ గా ఉన్నప్పుడే వ్యవస్థను ప్రశ్నించిన రామ్ నందన్.. ఆ తర్వాత పట్టుబట్టి ఐఏఎస్ ఆఫీసర్ గా మారుతాడు. కలెక్టర్ అయ్యాక చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. విశాఖపట్నంకు ట్రాన్స్ ఫర్ అయ్యాక సిటీని క్లీన్ చేసే పనిలో పడుతాడు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కొడుకు బొబ్బిలి మోపిదేవి (sj సూర్య)తో అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది. ఎస్ జే సూర్య అవినీతిని రామ్ నందన్ తరచూ అడ్డుకుంటాడు. ఈ సమయంలోనే సత్యమూర్తి చనిపోతాడు. తండ్రి చావును అడ్డుపెట్టుకుని మోపిదేవి సీఎం కావాలని ప్లాన్ వేస్తాడు. అప్పుడే ఎన్నికలు వస్తాయి. మోపిదేవిని సీఎం కాకుండా అడ్డుకునేందుకు రామ్ నందన్ పోరాడుతాడు. ఆ టైమ్ లోనే తన తండ్రి అప్పన్న గురించి.. తన అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. వాళ్ల ఆశయాలను నిజం చేసేందుకు రామ్ నందన్ ఏం చేశాడు, అతని జీవితంలోకి దీపిక (కియారా అద్వానీ) ఎలా వచ్చింది.. మోపిదేవి సీఎం అయ్యాడా అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..?
ఇది పక్కా పొలిటికల్ కథ. ఇలాంటి కథలు గతంలో కూడా చాలా వచ్చాయి. కానీ ఒక కథను ఎవరు ఎలా చెప్పారు, ఎలా చూపించారు అనే దాని మీదనే ఆ సినిమా రిజల్ట్ ఉంటుంది. శంకర్ ఈ సినిమాలో తన టేకింగ్ మార్క్ ను చూపించాడు. ఈ సినిమాకు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ కు తగ్గట్టే రామ్ నందన్ పాత్రను డిజైన్ చేశాడు. అతనిలో ఉండే ఆవేశం, అతని నిజాయితీ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. రామ్ చరణ్ లుక్స్ బాగున్నాయి. చాలా చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హెలికాఫ్టర్ షాట్ విజిల్ కొట్టిస్తుంది. ఇక అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సినిమాకు హైలెట్. అప్పన్న పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. కాకపోతే అక్కడక్కడా కథనం స్లోగా సాగినట్టు అనిపిస్తుంది.
ఎవరెలా నటించారు..?
ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ భుజాల మీద మోసినట్టు కనిపిస్తుంది. రామ్ నందన, అప్పన్న పాత్రల్లో అదరగొట్టేశాడు. పాత్రకు తగ్గట్టు అతని లుక్స్ మార్చుకున్నాడు. అంతే కాకుండా అతని పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ ప్రతి ఫ్రేమ్ లో చూపించాడు. రామ్ చరణ్ తర్వాత ఎస్ జే సూర్య పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది. అతని పాత్ర విలనిజానికి మరో లెవల్ లో ఉంటుంది. అంజలి ఉన్నంత సేపు అద్భుతంగా నటించింది. కియారా అద్వానీ పర్లేదు. శ్రీకాంత్, సునీల్, జయరాం, నాజర్ ఇలా సీనియర్ నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం..
ఈ సినిమాలోని చాలా సీన్లలో శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఒక రకంగా వింటేజ్ శంకర్ ను ఇందులో మనం చూడొచ్చు. కానీ శంకర్ యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ స్థాయిలో ఫ్రేమ్ లేదేమో అనిపిస్తుంది. చాలా వరకు సినిమా ఓకే అనిపించినా.. అక్కడక్కడా పేవలమైన డైలాగులు.. అందుకు తగ్గట్టు సీన్లను రక్తి కట్టించలేదేమో అనిపిస్తుంది. మొదటి గంట సేపటి వరకు కథలో సీరియస్ నెస్ లేదనిపిస్తుంది. ఇది శంకర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో. లవ్ స్టోరీని కూడా కామన్ గానే తీసేసినట్టు అనిపిస్తుంది. ఇంకా బెటర్ గా తీయాల్సింది. మ్యూజిక్ పరంగా తమన్ మార్కులు కొట్టేశాడు. బీజీఎం అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కథ రొటీన్ గానే ఉన్నా.. దాన్ని శంకర్ తీసిన విధానం మాత్రం చివరకు ఆకట్టుకుంటుందనే చెప్పుకోవాలి. దిల్ రాజు ఖర్చు పెట్టిని విధానం సినిమాలో కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్..
- రామ్ చరణ్ నటన
- ఎస్ జే సూర్య నటన
- తమన్ బీజీఎం
- యాక్షన్ సీన్లు
- గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్లు
- పేవలమైన డైలాగులు
- కొన్ని సీన్లను బోర్ కొట్టించేలా తీయడం
- సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం
చివరగా..
గేమ్ ఛేంజర్ సినిమా సోషియో పొలిటికల్ డ్రామా. ఇండియన్-2 తర్వాత శంకర్ తన మార్క్ చూపించే సినిమాను తీశాడు. హైప్ కు తగ్గట్టు లేకపోయినా సినిమా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ సినిమాకు వచ్చిన వారిని సంతృప్తి పరుస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5