ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చే దశలో అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీలోని మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మరి కొన్ని రోజుల్లో ఆ హామీ అమలు కాబోతోంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన “X” లో పోస్ట్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేసింది. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగానే “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” ని కూడా రద్దు చేసింది. తాజాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలందరూ ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు 15 నే తెరుచుకోనున్నాయి.