వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి కీలక డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. గతంలో తాడేపల్లి నివాసాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ కు సంబంధించి జగన్ ప్రైవేట్ గా కొన్ని డాక్యుమెంట్లు, డైరీలను మెయింటైన్ చేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి బుధవారం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఈ క్రమంలో జగన్ ఇంట అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వక చర్యేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత జగన్ విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో బుధవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత దేవినేని అవినాష్, అరవ సత్యం లతో కూడా ప్రైవేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాతే అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు జగన్ ఇంట రోడ్డు పక్కనే ఉన్న గార్డెన్ లో గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేశారని, అక్కడ గడ్డి ఎండిపోయి ఉండటంతో నిప్పు రాజుకుని మంటలు చెలరేగాయని ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి. అగ్నిప్రమాదం సమయంలో జగన్ ఇంటి లోపలే ఉన్నట్లు సమాచారం. మరోవైపు సిట్ విచారణకు భయపడి జగన్ అగ్నిప్రమాదం నాటకమాడుతున్నారంటూ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు అంటున్నారు. కోడి కత్తి 2.0 డ్రామాకి తెర లేపుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జగన్ 2.0 ని చూస్తారంటూ నిన్న మాజీ సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అది ఇదేనంటూ కూటమి వర్గాలు ట్రోల్ చేస్తున్నాయి.
