మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పది మంది మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భాండవ్ ప్రాంతంలో డ్రీమ్స్ మాల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఉధృతమై మూడో అంతస్తు వరకు చేరుకున్నాయి. అదే అంతస్తులో ఉన్న సన్ రైజ్ ఆస్పత్రిని చుట్టుముట్టాయి. ఇక్కడ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో దాదాపు 70 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, తమ ఆస్పత్రిలో ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కోవిడ్ తో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను బయటకు తీసుకొచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. తాము నిబంధనల మేరకే ఆస్పత్రి నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. అక్కడ ఉన్న కరోనా రోగులను మరోచోటకు తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాల ఇంకా తెలియలేదు.