తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ కౌంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలోనే ఆలయ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ నడుమ టీటీడీ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. మొన్ననే తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఇప్పుడు మళ్లీ లడ్డూ కౌంటర్ వద్ద ఇలా మంటలు చెలరేగాయి. టీటీడీ బోర్డు ప్రక్షాళన మొదలు పెట్టామని పదే పదే చెబుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వేసిన చాలా కమిటీలను రద్దు చేస్తున్నామని చెబుతోంది. అయినా సరే తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.
ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. లడ్డూ కౌంటర్ లోని 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఉన్న కంప్యూటర్ సీపీయూలో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు టీటీడీ సిబ్బంది. ఇక తొక్కిసలాట ఘటన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకు తగ్గిపోయింది. వెంకన్నను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనపై టీటీడీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో జరుగుతున్న ఈ వరుస ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.