సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – పవన్ కళ్యాణ్ విషయమై ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గత కొంతకాలంగా ఏ సభలో మాట్లాడినాగానీ, ‘పేపర్ చూసి’ మాట్లాడాల్సి వస్తోంది.
సొంత ప్రసంగాలు మానేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ నిర్వహించే బహిరంగ సభ.. అంటే, బలవంతంగా తీసుకొచ్చిన జనమే కాదు, వైసీపీ మీద అభిమానంతో వచ్చే కార్యకర్తలు కూడా ఆయన సభ పూర్తవకుండానే వెనుదిరగాల్సి వస్తోంది.
‘ముందైతే, పేపర్లో చూసి చదవడం మానేసి.. గుండె లోతుల్లోంచి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడండి ముఖ్యమంత్రిగారూ..’ అంటూ ఈ మధ్యనే జనసేన యువశక్తి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.
బహుశా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా, వేసిన సెటైర్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిలించినట్టుంది. చాలా కాలం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పేపర్ స్లిప్ చూడకుండా నాలుగు మాటలు గట్టిగా మాట్లాడగలిగారు. ‘చాలాకాలమైంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇలా చూసి..’ అని వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి.
తాజాగా జగనన్న చేదోడు కార్యక్రమానికి సంబందించి నిధుల విడుదల చేసే క్రమంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘సింహం.. తోడేళ్ళు’ అంటూ పిట్ట కథలు షరామామూలుగానే చెప్పారు. చంద్రబాబుని ‘ముసలోడు’ అంటూ వైఎస్ జగన్ సంబోదించడం గమనార్హం.
మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మార్పు తెచ్చిందన్నమాట. అలాగని, పూర్తిగా పేపరు ముక్కల్ని చదవడం మానేయలేదు వైఎస్ జగన్. పేపర్ ముక్కల్లో ముఖ్యాంశాల్ని పదే పదే చూసుకుంటూనే ప్రసంగాన్ని ‘మమ’ అనిపించారు.