వైఎస్ఆర్సిపి అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా జనంతో ప్రయాణించారు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన జనంలో తిరిగింది లేదు. సీఎం అయిన తర్వాత ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అధికారిక పర్యటన అయినా, వ్యక్తిగత కార్యక్రమమైనా పటిష్ట బందోబస్తుతో తిరిగేవారు. ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా జనాల్లోకి వచ్చి మాట్లాడింది లేదు.
సాక్షాత్తు సీఎం అయ్యుండి పరధాలు కట్టుకొని తిరుగుతున్నారన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. అయితే గురువారం ఆయన సామాన్య ప్రజలతో కలిసి విమానంలో ప్రయాణించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల బెంగళూరు వెళ్ళిన జగన్.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన బెంగళూరు నుంచి గన్నవరం కి ఇండిగో విమానంలో తన భార్య భారతి తో కలిసి ప్రయాణించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు.
ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ రెండోసారి బెంగళూరుకు వెళ్లారు. ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లడం సర్వత్ర చర్చనీయాంశమైంది.
అయితే, వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్య సంచలనం రేపడంతో జగన్ మధ్యలోనే తన పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చారు. ఈ హత్య ఏపీలో పొలిటికల్ వార్ కి తెరతీసింది. రషీద్ ని చంపిన జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు రషీద్ హత్య కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.