మొన్న వచ్చిన వరదల్లో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో చాలా మంది నష్టపోయారు. ఏపీలోని విజయవాడలో, ఇటు తెలంగాణలోని ఖమ్మంలో వరదల్లో వందలాది ఇండ్లు మునిగిపోయి.. వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే వారికి చాలా మంది ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా సినిమా హీరోలు, హీరోయిన్లు కోట్లలో విరాళం ప్రకటించారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్ కూడా ముందుకు వచ్చింది. ఫిల్మ్ నగర్ తరఫున అధ్యక్షుడు జి.ఆదిశేషగిరిరావు గారు, సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు కలిసి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
ఈ సందర్భంగా వరద బాధితుల కోసం రూ.25లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. అనంతరం ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు విపత్తులు సంభవించినా సరే సహాయ కార్యక్రమాల్లో ఎఫ్ ఎన్ సిసి క్లబ్ ముందు వరుసలోనే ఉంటుందని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఫిల్మ్ నగర్ తరఫున సాయం చేసినట్టు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ఏపీకి మాత్రమే కాకుండా అటు తెలంగాణకు కూడా రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేసినట్టు వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డికి రూ.25 లక్షల చెక్కును అందజేశామన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా ఫిల్మ్ నగర్ క్లబ్ కు చాలా అండగా నిలబడుతున్నాయని తెలిపారు. అందుకుగాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని వివరించారు. ఇక వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులను సీఎంలు చంద్రబాబు, రేవంత్ అభినందించారు.