సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబానికి ఆ కుటుంబంతో గత 30 ఏళ్లుగా స్నేహపూర్వక పరిచయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇరు కుటుంబాలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం సహజమేనని, అందులో ఎలాంటి అనుచిత అంశం లేదని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోల్లో అశ్లీలత ఏమాత్రం లేదని, కొన్ని దృశ్యాలను మార్ఫింగ్ చేసి తప్పుడు భావన కలిగించేలా ప్రయత్నించారని ఆరోపించారు.
ఆ వీడియోలను సరిగా ఎడిట్ చేయడానికీ ప్రయత్నించిన వారు విఫలమయ్యారని, అసలు విషయాన్ని వక్రీకరించేందుకు అశ్రద్ధగా కట్ చేసి మిక్స్ చేశారని అన్నారు. చూపించిన ఫోటోలు కూడా దాదాపు 20 ఏళ్ల క్రితం తీసినవేనని, వాటిలో అసభ్యకరమైనది ఏమీ లేదని వివరించారు. పాత ఫోటోలు, వీడియోలను కలిపి ఫేక్ కంటెంట్ తయారు చేసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
తమపై వస్తున్న బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. “నేను ఏ తప్పు చేశాను? ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలవడం తప్పా? మీ ఇళ్లకు స్నేహితులు రారా? మీరు వారి ఇళ్లకు వెళ్లరా?” అని ప్రశ్నించారు. సాధారణ కుటుంబ స్నేహాన్ని వల్గారిటీగా చూపించడం దురుద్దేశపూర్వక చర్య అని మండిపడ్డారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్, ట్రోలింగ్ వంటి అంశాలపై మరింత బాధ్యతతో వ్యవహరించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
