Adipurush: హిందుత్వం.. ఓ జీవన విధానం.! హిందుత్వాన్ని ఓ మతంగా మాత్రమే చూడకూడనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. యోగా విషయంలో కూడా ఓ మతానికి దాన్ని పరిమితం చేసేశారు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. యోగా అనేది, మన నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయింది.
ప్రపంచ దేశాలు యోగా వల్ల కలిగే లాభాల్ని (శారీరకంగా, మానసికంగా) గుర్తించాయి. యోగా వేరు, హిందూ మతం వేరు.!
ఇప్పుడిదంతా ఎందుకు.? అంటే, ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో కొంత నెగెటివిటీ కనిపిస్తోంది మతం కోణంలో.! భారతీయ సినిమా తెరపై ఇంతకు ముందెప్పుడూ హిందూ దేవతల సినిమాలు రాలేదా.? అంటే, ఎందుకు రాలేదు.. కుప్పలు తెప్పలుగా వచ్చాయ్.. వస్తూనే వుంటాయ్.
హిందూ దేవతల సినిమాలే కాదు, క్రిస్టియన్ సినిమాలు.. ముస్లిం సినిమాలు.. ఇలా అన్నిటినీ చూస్తున్నాం. క్రైస్తవం, ఇస్లాం నేపథ్యంలో వచ్చే సినిమాల్ని హిందువులు కూడా చూస్తున్నారు కదా.? కానీ, ‘ఆదిపురుష్’ సినిమాని ముస్లింలు కావొచ్చు, క్రిస్టియన్లు కావొచ్చు.. ఎందుకు చూడకూడదు.?
‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలోకి దళితులకు ప్రవేశం లేదట.. అంటే ఓ ఫేక్ ప్రచారం తెరపైకొచ్చింది. దాంతో, ‘ఆదిపురుష్’ టీమ్ కంగారు పడింది. అదంతా ఫేక్ న్యూస్.. అంటూ చిత్ర యూనిట్ ప్రకటించాల్సి వచ్చింది.
అసలు ‘ఆదిపురుష్’ మీద ఈ నెగెటివిటీని ప్రచారం చేయిస్తున్నదెవరు.? ‘ఆదిపురుష్’ సినిమాని కేవలం హిందువులకి మాత్రమే పరిమితం చేసే కుట్ర ఎందుకు జరుగుతోంది.? చిత్ర యూనిట్ చేస్తున్న ‘అతి ప్రచారం’ కూడా కొంత కొంప ముంచుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ‘జైశ్రీరాం’ అనే నినాదం.. ఈ సినిమాకి హిందూయేతరులు దూరమయ్యేలా చేస్తోందన్నది కొందరి భావన.