ఎఫ్ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సమయంలోనే ఎఫ్ 3 చేస్తామంటూ నిర్మాత దిల్ రాజు మరియు అనీల్ రావిపూడి ఇంకా హీరోలు చెప్పడంతో అప్పటి నుండి ఎఫ్ 3 కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎఫ్ 3 ఎంటర్ టైన్ చేసి తీరుతుందని యూనిట్ సభ్యులు బల్లగుద్ది మరీ చెప్పారు. మరి ఎఫ్ 2 తరహాలో ఎఫ్ 3 ఎంటర్ టైన్ చేసిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఎఫ్ 2 లోని పాత్రలతో ఎఫ్ 3 సినిమా కథ మొదలు అవుతుంది. అయితే ఆ కథకు ఈ కథ కొనసాగింపు కాదు. వెంకీ (వెంకటేష్) తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబంకు చెందిన వ్యక్తి.. మరో వైపు వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) కూడా డబ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు సంపాదన కోసం వీరిద్దరు హారిక(తమన్నా) మరియు ఆమె ఫ్యామిలీతో కలుస్తారు. ఒక డబ్బున్న వ్యక్తి (మురళి శర్మ) నుండి డబ్బు లు లాగేందుకు వీరంతా ప్లాన్ చేస్తారు. వారి ప్రయత్నాలకు వెంకీ.. వరుణ్ ల లోపాలు మరియు తమన్నా మెహ్రీన్ ల వ్యవహారం శాపంగా మారుతుంది. వెంకీ.. వరుణ్ లకు చివరకు అనుకున్న డబ్బు వస్తుందా… ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అనేది సినిమా కథ.
నటీనటులు:
వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇద్దరు కూడా వారి లోపాలను చాలా ఫన్నీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి నవ్వించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మంచి కామెడీ నటుడు అని ఎఫ్ 2 తర్వాత మరోసారి నిరూపితం అయ్యింది. ఇక వరుణ్ తేజ్ కూడా నత్తి ఉన్న పాత్రలో మెప్పించాడనే చెప్పాలి. ఇక మిగిలిన పాత్రల్లో కనిపించిన తమన్నా, మెహ్రీన్, వెన్నెల కిషోర్, సునీల్ లు కూడా వారి పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 కు కంటిన్యూ అని కాకుండా కొత్త కథను తీసుకున్నాడు. కొత్త కథ లో కామెడీని కాస్త బలవంతంగా జొప్పించినట్లుగా అనిపించింది. ఎఫ్ 2 లో ఎలా అయితే కామెడీ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశాడో అదే విధంగా ఇప్పుడు ఎఫ్ 3 లో కామెడీ తో నవ్వించే ప్రయత్నంలో దర్శకుడు అనీల్ రావిపూడి కథ విషయంలో మరియు స్క్రీన్ ప్లే విషయంలో తప్పులో కాలు వేసినట్లుగా అనిపించింది. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్:
- కొన్ని కామెడీ సన్నివేశాలు,
- వెంకటేష్ మరియు వరుణ్ తేజ్
నెగటివ్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే,
- పాత్రల మద్య గందరగోళం
చివరిగా:
ఈజీ మనీ కోసం కొందరు పడే కష్టాలను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. కథ మరియు కథనం విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది. రియాల్టీకి దూరంగా అనిపించింది. మొత్తంగా ఎఫ్ 3 కామెడీ సన్నివేశాల కార్యక్రమం చూసినట్లుగా అనిపించింది.
తెలుగు బులెటిన్ రేటింగ్ : 2.5/5