సూర్య నటించిన గత రెండు చిత్రాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ ఓటిటిల్లోనే విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ వచ్చింది. పైగా సూర్య సినిమా రెండేళ్ల తర్వాత థియేటర్లలో వస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటీ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
బేసిక్ గా ఈ చిత్రం కృష్ణ మోహన్ (సూర్య), కామేష్ (వినయ్ రాయ్) మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఫస్ట్ హాఫ్ అంతా సూర్య ఇంట్లో జరిగే ఫ్యామిలీ డ్రామా, ప్రియాంక మోహన్ తో ఉండే రొమాంటిక్ ట్రాక్ తో గడిచిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ నుండి కృష్ణ మోహన్, కామేష్ పాత్రల మధ్య యుద్ధం మొదలవుతుంది. మరి రాజకీయంగా బోలెడంత పలుకుబడి ఉన్న కామేష్ చేస్తోన్న అకృత్యాలను లాయర్ అయిన కృష్ణ మోహన్ ఎలా అరికట్టాడు అన్నది చిత్ర కథ.
నటీనటులు:
సూర్య ఎంత మంచి నటుడు అన్నదాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తాను ఎంత గొప్ప నటుడు అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలతో రీసెంట్ గానే ప్రూవ్ చేసాడు. అయితే ఈటీ, సూర్య నటనకు అంత పరీక్ష పెట్టే పాత్ర అయితే కాదు. ఇది ఎక్కువ మాస్ అంశాల చుట్టూ నడిచే పాత్ర. అయితే తాను మంచి నటుడు, స్టార్ హీరో కూడా అని ఈ చిత్రంతో ప్రూవ్ చేసాడు. అవకాశమున్న చోటల్లా మాత్రం సూర్యలోని నటుడు విజృంభించాడు.
ప్రియాంక మోహన్ క్యూట్ గా ఉంది. పెర్ఫార్మన్స్ పరంగానూ వంకపెట్టడానికి లేదు. సెకండ్ హాఫ్ లో పెర్ఫార్మన్స్ చూపించే స్కోప్ కూడా దక్కింది. సూర్యతో ఆమె సీన్స్ కూడా బాగానే పండాయి.
ఇక వినయ్ రాయ్ విలన్ గా ఒకేలాంటి పాత్రలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఈ సినిమా వరకూ చూసుకుంటే తన పాత్రకు ఢోకా లేదు. సూర్యతో ఫోన్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి.
సత్యరాజ్, శరణ్యలకు కూడా మంచి పాత్రలు దక్కాయి. మిగతా వారి పెర్ఫార్మన్స్ లు కూడా ఓకే.
సాంకేతిక నిపుణులు:
డి, ఇమ్మాన్ సంగీతం బాగానే సాగింది. పాటలు సో సో గా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెప్పిస్తాడు. అయితే కొన్ని చోట్ల మరీ లౌడ్ గా కొట్టిన భావన కలుగుతుంది. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. రత్నవేలు స్థాయి అందరికీ తెలుసు కాబట్టి ఈ చిత్రంలో వర్క్ మామూలుగానే అనిపిస్తుంది. విడిగా చూస్తే ఈ విలేజ్ డ్రామాకు తగ్గట్లుగా రత్నవేలు పనిచేసాడు.
ఎడిటింగ్ లో ఇంకా పదును ఉండొచ్చు. పాండిరాజ్ కథ రొటీన్ గానే సాగినా స్క్రీన్ ప్లే ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్లినా కూడా తన టేకింగ్ తో మెప్పించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను పాండిరాజ్ పకడ్బందీగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక్కడ వచ్చే ఎమోషనల్ డ్రామా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
పాజిటివ్ పాయింట్స్:
- సూర్య
- సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని బ్లాక్స్
నెగటివ్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- ఫస్ట్ హాఫ్
చివరిగా:
ఒక బలమైన సోషల్ పాయింట్ తో తెరకెక్కిన రొటీన్ యాక్షన్ డ్రామా ఈటీ. సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. దీంతో పాటు సూర్య పెర్ఫార్మన్స్ మెయిన్ ప్లస్ పాయింట్ గా ఉన్న ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది. మిగతా వారికి ఓకే ఓకే అనిపిస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5