జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. “సేన ప్రస్థానం… జాతీయ సమైక్యత కోసం” అనే అంశంపై జరగనున్న ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరగనున్నాయి.
ప్రాంతీయతను గౌరవిస్తూనే జాతీయ సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే భావజాలంతో జనసేన ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు జాతీయ సమైక్యత కోసం జనసేన చేపట్టిన కార్యక్రమాలు, ఆ దిశగా పార్టీ ఆలోచనా విధానం, భవిష్యత్ లక్ష్యాలను పవన్ కళ్యాణ్ నాయకులకు వివరించనున్నారు.
ఈ సమావేశానికి జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ముఖ్య నేతలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన నాయకులను కూడా ఆహ్వానించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే జాతీయ సమైక్యత కోసం రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. దేశ రాజధానిలో రేపు నిర్వహిస్తున్న ఈ సమావేశం జనసేన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఢిల్లీలోని అశోక హోటల్‌లో సోమవారం (జూన్ 15) ఉదయం ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగనుంది.
