iPhone 15: టెస్లా కంపెనీ, ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఏం చేసినా సంచలనమే. ఇప్పుడు ఆయన ఐఫోన్ 15 (iPhone 15) కొంటున్నానని చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఐఫోన్ సేల్స్ విపరీతంగా పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 15 సంచలనం రేపుతోంది. టెక్ వర్గాల్లో ఎక్కడ చూసినా దానిపైనే చర్చ.
ఈ నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim cook) ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు ఐఫోన్ ప్రో మ్యాక్స్ తో తీసిన ఫొటోలను షేర్ చేశారు. ఐఫోన్ తో తమ సృజనకు పదునుపెట్టి అద్భుతాలు చేయొచ్చని వీరు నిరూపించారంటూ కొనియాడారు. వారితో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
టిమ్ ట్వీట్ కు ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తూ తాను ఐఫోన్ తో తీసిన ఫొటోలు, వీడియోలు అద్భుతమని కొనియాడుతూ తాను ఫోన్ కొంటున్నానని అన్నారు. తన ట్వీట్ తో పాటు ఐఫోన్ కోసం న్యూయార్క్ లో నెలకొన్న సందడిని కూడా పోస్ట్ చేశారు.