వై నాట్ 175 జోస్యం నవ్వులపాలైపోయినా, వైసీపీ నేతలు ‘జోస్యం’ చెప్పడం మాత్రం మానడంలేదు.! కొత్తగా 2027 చివర్లో ఎన్నికలంటూ వైసీపీ కొత్త జోస్యం షురూ చేసింది. దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, 2029 నాటికి తప్ప, ఈలోగా జమిలి ఎన్నికలకు ఆస్కారమే లేదన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 2028 చివరి నాటికి జమిలి ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి సన్నద్ధతకు ఆస్కారం వుంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే, 2029లో సాధారణ ఎన్నికలే, దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు కాబోతున్నాయన్నమాట.
మరి, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎందుకు 2027 చివర్లో జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెబుతున్నట్లు.? ఇదేమీ వింత కాదు.. నిజానికి, రేపో ఎల్లుండో ఎన్నికలు జరిగితే బావుండని వైసీపీ భావిస్తున్నట్లుగా వుంది ఆ పార్టీ పరిస్థితి.
ఇటీవలి ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీ, నిజానికి కోలుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే వైసీపీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పేశారు. మరికొందరు, పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు, ‘త్వరలోనే ఎన్నికలు’ అంటూ కొత్త పల్లవి అందుకుందన్నమాట వైసీపీ.
వాస్తవానికి, ఈ ‘జమిలి’ ప్రచారం కూడా వైసీపీకి చేటు చేస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గా పునర్ విభజన.. వంటి వ్యవహారాలు చాలానే వున్నాయి. వైసీపీకి ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లే వచ్చిన దరిమిలా, ఆ పార్టీలో వుండడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితి.
కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఒకింత వ్యూహాత్మకంగా అడుగులేస్తూ, పార్టీ ఫిరాయింపుల విషయమై ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. అలాకాకుండా, పార్టీ ఫిరాయింపుల్ని గనుక ప్రోత్సహిస్తే, వైసీపీ అనేది కాలగర్భంలో కలిసిపోవడానికి పెద్దగా సమయం పట్టదు.
ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, 2027 చివర్లో జమిలి ఎన్నికలకు ఆస్కారం వుంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరుకి పరిమితమయ్యేవారే కాదు. వీకెండ్ రాజకీయాలు చేస్తే, వైఎస్ జగన్ టైమ్ పాస్ చేస్తున్నారంటేనే దానర్థం, ఇప్పట్లో ఎన్నికలు లేవని.
కాగా, జమిలి ఎన్నికల విషయమై ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ, ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్నది కూటమి ప్రభుత్వమే.
ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు విజయసాయిరెడ్డి, జమిలి ఎన్నికల్ని ప్రస్తావిస్తూ, ప్రశంసిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేస్తోంటే, బీజేపీలోకి విజయసాయిరెడ్డి దూకేస్తారేమోనన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.