దేశ రాజధాని ఢిల్లీని భూకంప ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు వణికించాయి. భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. పొరుగు దేశం ఢిల్లీకి దగ్గరలో ఉన్న నేపాల్ లో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీలో 30 సెకన్లపాటు భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్ సీఆర్ తోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో ఇలా భూమి కంపించడం జనవరి నెలలో మూడోసారి కావడం విశేషం.
ఈ సమయంలో ఇళ్లలోని వస్తువులు కదలటం, పడిపోవడంతో, ఫ్యాన్లు ఊగడంతో ప్రజలు వణికిపోయారు. దీంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నేపాల్ లో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ కు 148 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదయింది. భూకంపం ధాటికి జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.