Earthquake : నేడు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెకన్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కొందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, మరి కొందరు భూకంప భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూమి కంపించినట్లుగా సమాచారం అందుతోంది. ప్రధానంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భూమి అధికంగా కంపించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమం, కరీంనగర్ జిల్లాల్లో భూమి కంపించింది. భూమి కంపించిన విజువల్స్ సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాలకు కొన్ని చోట్ల, 7 గంటల 28 నిమిషాలకు కొన్ని చోట్ల భూమి కంపించింది.
భూకంపం ధాటికి పలు వస్తువులు కింద పడటంతో పాటు, ఇంటి పై కప్పు కంపించినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూకంపం గురించి అధికారులు మాట్లాడుతూ 5 సెకన్ల పాటు భూమి కంపించిందని, భూకంప కేంద్రం నుంచి 2225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం ఉన్నట్లుగా వారు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో గుర్తించలేనంతగా కేవలం 3 సెకన్లు మాత్రమే భూకంపం వచ్చింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూమి ఈ స్థాయిలో కంపించిందని నిపుణులు చెబుతున్నారు.