చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపులు తిరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం ఉదయం అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కల్యాణ్ గారు, ఏనుగుల సంచారం, పంట నష్టాలు, ఇటీవల జరిగిన రైతు మృతి ఘటనపై సమీక్ష చేశారు. చంద్రగిరి పరిధిలోని కళ్యాణి డ్యామ్ సమీపంలో 11 ఏనుగుల గుంపు (వాటిలో 4 పిల్ల ఏనుగులు) పొలాలు, తోటలు తొక్కివేశాయని అధికారులు వివరించారు. డ్రోన్ సాయంతో ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ గారు, ఏనుగులు కదిలే దిశలో ఉన్న గ్రామస్తులకు ముందస్తు సమాచారం అందించడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్చరికల పంపిణీని డీఎఫ్ఓ కార్యాలయాలు మరియు పీసీసీఎఫ్ కార్యాలయం పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే, ఏనుగులను అటవీ ప్రాంతాల వైపు మళ్లించే చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
