ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలోని పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన స్పష్టం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కొచ్చి చేరుకున్న ఆయన అక్కడే అగస్త్య ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తనను ఎంతో కలిచి వేసిందని అన్నారు.
” కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారం నన్ను ఎంతగానో కలచివేసింది. ఎంతో మంది భక్తులు అక్కడికి ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. వారి మనోభావాలను గౌరవించాలన్నదే నా ఆవేదన. లడ్డు కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదే నా బలమైన ఆకాంక్ష. ఈ వివాదానికి కారణమైన దోషులను అరెస్టు చేయడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఘటన ఇకమీదట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక దక్షిణాది ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదు. నాలుగున్నరేళ్ల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల కోసం ఇక్కడికి వచ్చాను. నా ఆరోగ్యం సహకరించకపోయినా ఇక్కడికి రావాల్సి వచ్చింది” అని పవన్ పేర్కొన్నారు