113 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆయన 267 ఎలక్టోరల్ స్థానాల్లో ఆధిక్యం సాధించడంతో ఆయన గెలుపు ఖాయమైంది. మరో 44 ఎలక్టోరల్ స్థానాలను ఆయన గెలుచుకునే అవకాశం ఉంది. గెలుపుకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ సీట్లు 270. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 224 స్థానాలు సొంతం చేసుకున్నారు. దీంతో ఆమెకు నిరాశ ఎదురైంది. తొలుత కమలా కీలక స్థానాలు గెలుచుకుని పుంజుకున్నట్లు కనిపించినా..స్వింగ్ రాష్ట్రాలు ట్రంప్ దక్కించుకున్నారు. దీంతో ఆయన గెలుపు సునాయాసమైంది. మరోవైపు ట్రంప్ గెలుపును వైట్ హౌస్ ధృవీకరించింది. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ వేనని పేర్కొంటూ వైట్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు.
అగ్రరాజ్యంలో సాధారణంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హత ఉంది. మొదటిసారి ఎన్నికైన వారు రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఒకసారి గెలిచి, మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయి మూడోసారి పోటీ చేసి విజయం సాధించి అధికారం లోకి రావడం అమెరికా ఎన్నికల్లో అత్యంత అరుదు. ఇలా 113 ఏళ్ల క్రితం జరిగింది. ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తి ట్రంప్. అంతకు ముందు 1892 లో గ్రోవర్ క్లీవ్లాండ్ ఇలాంటి విజయం సాధించారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే విధంగా వైట్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన 267 స్థానాల్లో ఆధిక్యం సాధించి మ్యాజిక్ ఫిగర్ కి చేరువగా ఉండటంతో ఈ ఫీట్ సాధ్యమైంది.