సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. డైరెక్టర్ గా అనిల్ రావిపూడి కెరీర్ కు జనవరి 23తో పదేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నా కెరీర్ పదేళ్లు అవుతున్న సందర్భంగా మంచి హిట్ కొట్టడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు నవ్వుకునే సినిమాలు చేయాలన్నదే నా డ్రీమ్. వారికి పైసా వసూలు సినిమాలను అందిస్తూనే ఉంటానని తెలిపారు.
ఈ పదేళ్లు ప్రతి సినిమాతో నాకు మంచి ఎక్స్ పీరియన్స్ వచ్చింది. నేను చేసిన ప్రతి హీరోతో మంచి రిలేషన్ ఏర్పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పదేళ్ల కెరీర్ క్రెడిట్ మొత్తం హీరో కళ్యాన్ రామ్ కే ఇవ్వాలి. ఎందుకంటే ఆయనే నాకు అవకాశం ఇచ్చి డైరెక్టర్ గా మార్చారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకటేష్ తో ఎఫ్2, సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, మళ్లీ వెంకీతో ఎఫ్3, బాలకృష్ణతో భగవంత్ కేసరి మళ్లీ వెంకీతో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం.. ఇలా అందరు హీరోలకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. వీరంతా ఒకప్పుడు నేను సినిమాలు చూసి అభిమానించిన వారే.
ఈ పదేండ్ల కెరీర్ లో ప్రేక్షకుల్లో నా మీద ఓ భావన ఏర్పడింది. నా సినిమాలు అంటే కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాయని వారు నమ్ముతున్నారు. అదే నాకు అతిపెద్ద సక్సెస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నా మీద వారికి నమ్మకం మరింత పెరిగింది. నాకు సెంటిమెంట్ కంటే కంటెంట్ మీదనే నమ్మకం ఉంటుంది. కథ నచ్చితే ప్రేక్షకులే దాన్ని సక్సెస్ చేస్తారు. దిల్ రాజుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాతో అది మరింత పెరిగింది.