Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈమేరకు వివరాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
‘2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకూ విడుదలైన సినిమాల్లో ఉత్తమ సినిమా ఎంపిక చేసి అవార్డు ఇస్తాం. 2024కు సంబంధించి పాత రోజుల్లో పద్ధతి ప్రకారం ఇస్తాం. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించే క్రమంలో ఉత్తమ సినిమా ఇచ్చేందుకు కూడా నిర్ణయించాం. గతంలో సింహా అవార్డు దరఖాస్తుదారులకు ఎఫ్ డీసీకి చెల్లించిన నగదు తిరిగిచ్చేస్తాం’.
‘గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు పలు విధానాలు పాటిస్తున్నాం. పైడి జయరాజ్, కాంతారావు పేరుతో పురస్కారాలు కూడా ఇస్తాం. సినిమా అవార్డుల కార్యక్రామాన్ని ఎవరూ వివాదం చేయొద్దు. అందరూ సహకరించి విజయవంతం చేయాలి. అప్పుడే ప్రతి ఏటా ఘనంగా కార్యక్రమం చేసుకోగలం. అవార్డులు, సినిమాల గురించి నెగటివ్ గా స్పందించేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేద’న్నారు దిల్ రాజు.