వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, ఎక్కడ ఏ అధికారిక బహిరంగ సభలో అయినా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలే.! ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు, నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు, నలుగురు నలుగురు భార్యలు, కార్లు – భార్యలు, పెళ్ళాలు.. ఇదే ప్రస్తావన తీసుకొచ్చేవారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అది పసి పిల్లలకు సంబంధించిన కార్యక్రమం కావొచ్చు, మహిళలకు సంబంధించిన కార్యక్రమం కావొచ్చు.. ఇంకేదైనా కార్యక్రమం కావొచ్చు. ప్రజాధనంతో నిర్వహించిన బహిరంగ సభల్లో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై అప్పట్లో పెద్దయెత్తున దుమారం చెలరేగింది.
జనాల్ని బలవంతంగా బస్సుల్లో తరలించడం, బోల్డంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం.. ఇదీ, వైసీపీ హయాంలో అధికారిక బహిరంగ సభల నిర్వహణ. ఇంతా చేసి, అక్కడ జరిగేది బటన్లు నొక్కే వ్యవహారం మాత్రమే.
రోజులు మారాయ్. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారికంగా ఏ కార్యక్రమం జరుగుతున్నా, వాటిల్లో మంత్రులెవరూ బూతులు మాట్లాడటంలేదు. అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ వేదికలపై విమర్శలు.. అది వేరే చర్చ.
తాజాగా, జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వణ్య ప్రాణి వారోత్సవంలో విద్యార్థినీ విద్యార్థులతో మమేకమయ్యారు. సనాతన ధర్మం.. ప్రతి ప్రాణిలోనూ దేవుడ్ని మనం చూసేలా చేసిందంటూ కూర్మావతారం, మత్స్యావతారం.. వంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ వివరించారు.
ఈ భూమ్మీద మనిషికి జీవించే హక్కు ఎంత వుందో, చెట్టూ చేమా.. అన్నిటికీ అదే హక్కు వుందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ‘మీ కోసమే మేం వచ్చాం..’ అని చిన్నారులు చెబుతోంటే, ‘మీ కోసమే నేనూ వచ్చాను’ అని చిన్నారుల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
హంగూ ఆర్భాటాలకు తావు లేకుండా, అత్యంత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వన్య ప్రాణుల సంరక్షణకు మనమంతా నడుం బిగించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎక్కడా రాజకీయ విమర్శలకు తావివ్వకుండా, వ్యక్తిగత విమర్శలకు ఆస్కారమివ్వకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుకి విద్యార్థులూ ముచ్చటపడ్డారు.
అప్పట్లో బలవంతంగా పసి పిల్లలోత ‘జగనన్న పాటలు’ పాడించిన పరిస్థితుల్ని చూశాం. ఇప్పుడలాంటి కీర్తనలు సీఎం చంద్రబాబు విషయంలోగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలోగానీ కనిపించడంలేదు.
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, తాను మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ శాఖకు సంబంధించి, ప్రజల నుంచి వినతులు వస్తున్నా.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు నడుం బిగిస్తున్నారు. సమీక్షా సమావేశాలు సహా ప్రతి కార్యక్రమాన్నీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అత్యంత బాధ్యతగా నిర్వహిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.